ఆడవారు అపరిచిత వ్యక్తులను నమ్మవద్దు- చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు


*ఒంటరిగా ఉన్న ఇళ్ళను లక్ష్యంగా చేసుకొని ఆరోగ్య సమస్యలను కొన్ని పూజల వలన నయం చేస్తామని ఎవరైనా మీ ఇంటికి అపరిచిత వ్యక్తులు వస్తే వారిని నమ్మకండి అటువంటి వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వండి – చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS.*

*మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని పూజలు చేస్తామని మీ ఇంటికి వచ్చారా… వారి చేతిలో మోసపోకండి…*

*బంగారం లేదా వెండి వస్తువులను మెరుగు పెడతాము అని మాయమాటలు చెప్పే వారిని నమ్మకండి*

*ఆరోగ్య సమస్యలను పూజల ద్వారా పరిష్కరించలేం, నిజమైన సహాయం కోసం సరైన మార్గం ఎంచుకోండి.*

*మూఢనమ్మకాలు మన శక్తిని బలహీనపరుస్తాయి, జాగ్రత్తగా ఉండి వాటిని నివారించాలి.*

ఈ మద్య కాలంలో ఇటువంటి మోసాలు ఎక్కువ అవుతున్న తరుణంలో దీని పై జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS గారు ప్రత్యేక చొరవ తీసుకోని అటువంటి నేరాలు కట్టడి చేయుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సలహాలు మరియు సూచనలతో కూడిన ఆదేశాలు జారి చేసారు.

ఈ సందర్బముగా జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఈ రకమైన మోసాలు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి పూజలు చేస్తామని, ఆ పూజల కోసం నగలను సమర్పించాలని కోరడమనే పద్ధతి ప్రజల్లో అవగాహన లేకపోవడం, తక్కువ విద్య, మూఢనమ్మకాల ప్రభావం వలన జరుగుతున్నాయి. ఈ విధమైన మోసాలను అనేక మంది చేస్తున్నారు, అది ప్రత్యేకించి పల్లెటూర్లలో మరియు తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు.

మొదటగా, ఈ రకమైన మోసాలకు కారణం ప్రజల్లో ఉన్న నమ్మకాల నుండి సద్వినియోగం చేసుకోవడమే. మోసగాళ్ళు ప్రజల ఆకాంక్షలు, భయాలు మరియు అజ్ఞానం పై ఆధారపడి, వారిని తప్పుడు పద్ధతులలోకి దారి తిప్పుతూ, వారి ఆస్తులను దోచుకుంటారు. ఇలాంటి సంఘటనల్లో, ఆడంబరంగా ధారణ చేసే మోసగాళ్ళు చాలా విశ్వసనీయంగా, ప్రత్యేకంగా కనబడతారు. వారు ఒక ప్రత్యేక పూజ చేసి, సమస్యను పరిష్కరించగలమని హామీ ఇస్తారు. అందుకు మారుగా, ఆ వ్యక్తి తమపై ఉన్న విలువైన నగలను లేదా ఇతర వస్తువులను ఆ పూజకు సమర్పించాలని చెప్పడం జరుగుతుంది. ఈ పద్ధతి అమలు చేసిన తర్వాత, మోసగాళ్ళు ఆ వ్యక్తి నగలను తీసుకొని పరారవుతారు. మోసానికి గురైన వారు, తమ ఆస్తులను కోల్పోవడమే కాకుండా, వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యకు సమాధానం దొరక్కపోవడంతో మరోసారి కష్ట పడతారు.

ఆగష్టు నెల 21వ తేదీన ఐరాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇలాంటి ఒక సంఘటన గురించి వివరిస్తూ ఒంటరిగా ఉంటున్న ఒక మహిళను లక్ష్యంగా చేసుకొని ముందుగా ఒక మహిళ ఆ ఊరంతా తిరిగి ఒంటరిగా ఉన్న వారి ఇళ్ళకు వెళ్లి మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయ అని తెలుసుకొని మీ ఆరోగ్యం తొందరగా బాగావ్వాలంటే తెల్ల దుస్తులు వేసుకొని ఇద్దరు వ్యక్తులు వస్తారని వారు మాత్రమే మీ సమస్యను బాగుపరచగలరని చెప్పి వెళ్ళిపోతారు. ఒక రెండు రోజుల తరువాత ఇద్దరు మగ వ్యక్తులు ఆమె ఇంటికి వెళ్లి ఇలా మీకున్న ఆరోగ్య సమస్యలను బాగుచేస్తామని అందుకు గాను ఒక పూజ చేయాలని తెలిపి, ఆ పూజ లో బాగంగా మీరు ధరించిన బంగారు నగలను ఒక డబ్బాలో పెట్టి పూజలో ఉంచాలని తెలిపి పూజలు మొదలుపెట్టి మీరు కళ్ళు మూసుకొని దేవుడిని స్మరించాలని నమ్మబలికి పూజలో ఉంచిన నగలను అపహరించుకొని వెళ్ళిపోయారు. ఇలా ఆ మహిళా వారి చేతిలో మోసపోయి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తులో ఉన్నది.

ఈ సమస్యకు సమాధానంగా, మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికావద్దని, నిజమైన ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం, ఆరోగ్య సలహాలు తీసుకోవడం అనేది సరైన మార్గమని తెలిపారు.

ఇలాంటి వారు ఎవరైనా మీ చుట్టుపక్కల సంచరించిన లేదా మీ ఇంటికి వచ్చి చేస్తామని చెప్పిన వెంటనే మీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో తెలుపగలరు లేదా డయల్ 100/112 కు లేదా చిత్తూరు జిల్లా పోలీస్ వాట్స్ యాప్ నెంబర్ 9440900005 కు సమాచారం ఇవ్వగలరు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements