అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన కమలా హ్యారీస్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పెన్సిల్వేన్వియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన కమలా హ్యారీస్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తన ప్రత్యర్థి కమలా హ్యారీస్ కంటే తానే చూడడానికి బాగుంటానని అన్నారు. ఆమె కంటే తాను మెరుగ్గా ఉంటానని భావిస్తున్నట్టు పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’లో హ్యారీస్‌ను అందాన్ని అభివర్ణిస్తూ కాలమిస్ట్ పెగ్గీ నూనన్ రాసిన వ్యాసాన్ని ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
టైమ్ మ్యాగజైన్ కవర్‌పై ఉన్నది హీరోయిన్స్ సోఫియా లోరెన్ లేదా ఎలిజబెత్ టేలర్ అని అనుకున్నానని ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఆడవాళ్ల అందాలను పొగడవద్దంటూ ర్యాలీలో ఆయన అన్నారు. రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి డేవిడ్‌కు సూచన చేస్తున్నట్టుగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇలాంటివి మాట్లాడడానికి మీకు అనుమతి లేదు. ఇలాంటి ఇబ్బందుల్లో పడొద్దు. దయచేసి స్త్రీలు అందంగా ఉన్నారని ఎప్పుడూ అనకండి. ఎందుకంటే అది మీ రాజకీయ జీవితానికి ముగింపు అవుతుంది’’ అని మాజీ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఎన్నికలు సమీపిస్తుండడంతో గత మూడు వారాలుగా హ్యారిస్‌పై ట్రంప్ విమర్శల దాడిని పెంచారు. అయితే వ్యక్తిగత విమర్శలకు సైతం ట్రంప్ వెనుకాడడం లేదు. కమలకు ‘వెర్రి’ అని కూడా ఈ మధ్య వ్యాఖ్యానించారు. ఇక ఈ శుక్రవారం కమలా హ్యారీస్ ప్రకటించిన ఆర్థిక ప్రణాళికపై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికాలో కమ్యూనిజానికి బీజం వేసే ప్రణాళిక ఇదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.