Pakistan: ప్రపంచంలోని అన్ని దేశాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేశాల్లో ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉంటే, మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువ దిగుబడులు సాధిస్తుంటాయి. ఈ మిగులు నిల్వలను విదేశాలు ఎగుమతి చేసి లాభాలు అందుకుంటాయి. అయితే కొన్నేళ్లుగా పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలోని చాలా రంగాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఆ దేశానికి గాడిదలు లాభాలు తెచ్చి పెడుతున్నాయి.
పాకిస్థాన్ ఎకనామిక్ సర్వే 2023-24, గత సంవత్సరం ప్రధాన సామాజిక-ఆర్థిక విజయాలను హైలైట్ చేసింది. ఈ ప్రీ-బడ్జెట్ డాక్యుమెంట్, వ్యవసాయ రంగంలో పశువులు వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొంది. గేదెలు 43.7 మిలియన్ల (4 కోట్ల 37 లక్షలు) నుంచి 45 మిలియన్లకు పెరిగాయి. గొర్రెలు 32.3 మిలియన్లకు, మేకల సంఖ్య 84.7 మిలియన్లకు చేరింది. ఆసక్తికరంగా ఆ దేశంలో గాడిదల సంఖ్య కూడా 1,00,000 పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గాడిదల సంఖ్య 5.8 మిలియన్లకు (58 లక్షలు) చేరుకుంది. అంతకుముందు సంవత్సరం వీటి జనాభా 5.7 మిలియన్లుగా ఉంది.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన టాప్ 10 నగరాలు ఇవే..?
వారికి చాలా అవసరం
పాకిస్థానీలకు గాడిదలతో చాలా అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా జీవనానికి పశువులపై ఆధారపడే గ్రామీణ ప్రాంతాల్లో వీటికి ప్రాధాన్యత ఉంది. వస్తువులను రవాణా చేయడానికి, వ్యవసాయ అవసరాలకు ఇక్కడ గాడిదలను ఉపయోగిస్తారు. గల్ఫ్ న్యూస్ నివేదిక ప్రకారం, చైనాకు గాడిదలను ఎగుమతి చేయడం ద్వారా భారీ ఆదాయం పొందాలని పాకిస్థాన్ యోచిస్తోంది. ప్రపంచంలో ఎక్కువ గాడిదలు ఉన్న దేశాల్లో పాకిస్థాన్ 5 మిలియన్లతో మూడో స్థానంలో ఉంది. అయితే చైనా మొదటి స్థానంలో ఉంది.
చైనాలో డిమాండ్
రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇ-జియావో (E-jiao) కోసం ప్రతి సంవత్సరం లక్షల కొద్దీ గాడిదలను చంపుతున్నారు. ఇది ఒక లగ్జరీ ప్రొడక్ట్. యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ కారణంగా ఇది చైనాలో పాపులర్ అయింది. ఇ-జియావో మందును గాడిద చర్మం నుంచి సేకరించిన కొల్లాజెన్ ద్వారా తయారు చేస్తారు. దీన్ని ఫుడ్, బ్యూటీ ప్రొడక్టుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది రక్తాన్ని మెరుగుపరుస్తుందని, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని, వ్యాధులను నివారిస్తుందని నమ్ముతారు.
పెరుగుతున్న డిమాండ్ కారణంగా చైనా ఇతర దేశాల నుంచి గాడిదలను దిగుమతి చేసుకుంటోంది. పొరుగున ఉన్న పాకిస్థాన్ నుంచి లబ్ధి పొందాలని చూస్తోంది. చైనాలో గాడిదల సంఖ్య 1992లో 11 మిలియన్ల నుంచి 2024 నాటికి భారీగా పడిపోయింది. దీంతో ఇ-జియావో ఇండస్ట్రీలు గాడిద చర్మాల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి. అయితే ఇప్పటికీ చాలా మంది పాకిస్థానీలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి, గాడిదలే చివరి ఆశగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో స్థానిక ఆర్థిక వ్యవస్థ ఈ జంతువులపై ఎక్కువగా ఆధారపడుతుంది. అందుకే గాడిదల సంరక్షణ కోసం ప్రజలు చర్యలు తీసుకోవడంతో పాకిస్థాన్‌లో వాటి జనాభా పెరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..